Jagan: చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడి ఉన్నారు: జగన్
- ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేల భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?
- సమస్యలు పోవాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారు
- ఉద్యోగాలు వచ్చే ఏకైక అవకాశం ప్రత్యేక హోదా
- దాన్ని కూడా తాకట్టు పెట్టేశారు
'బాబు రావాలి సమస్యలు పోవాలి' అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమస్యలను తీర్చుతున్నాడా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పాపంపేటలో పాదయాత్ర కొనసాగిస్తోన్న జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉద్యోగాలు వచ్చే ఏకైక అవకాశం ప్రత్యేక హోదా అని, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశారని అన్నారు.
సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని అన్నారు. బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని అదీ చేయలేదని అన్నారు. ఉపాధి, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు ఇస్తామన్నారు ఇచ్చారా? అని జగన్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ ఉన్నారని అన్నారు.
ఏపీలో అడుగడుగునా అవినీతి జరుగుతోందని చెప్పారు. అన్నింటా దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాల్లో మరుగుదొడ్లు కావాలన్నా లంచం తీసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మనం ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలో ఆలోచించుకోండని జగన్ అన్నారు.