Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అణుదాడి బాధితురాలు

  • ఐసీఏఎన్ కు 2017 నోబెల్ శాంతి పురస్కారం
  • నార్వేలోని ఓస్లో సిటీ హాల్ లో బహుమతి ప్రధానం
  • అణ్వాయుధాలను నిర్వీర్యం చేయాల్సిందే
  • ఐసీఏఎన్ చీఫ్ బీట్రైస్ ఫిన్
2017 సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతిని అణ్వస్త్రాలు వాడవద్దని ప్రచారం చేస్తున్న ఐసీఏఎన్ (ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్)కు లభించగా, హిరోషిమాపై 1945లో అణుదాడి జరిగిన వేళ, తీవ్ర గాయాలతో బతికి బయటపడిన బాధితురాలు సెస్కుకో తుర్లో, ఐసీఏఎన్ చీఫ్ బీట్రైస్ ఫిన్ లు అందుకున్నారు. నార్వేలోని ఓస్లో సిటీ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ఆహూతుల హర్షధ్వానాల మధ్య నోబెల్ ను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఫిన్ మాట్లాడుతూ, ప్రపంచం అణు భయం ముందు నిలిచిందని, అన్ని దేశాలూ కలసి కట్టుగా నిర్ణయం తీసుకుంటేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కగలమని వ్యాఖ్యానించారు. అన్ని దేశాల్లోని అణ్వాయుధాలనూ నిర్వీర్యం చేయాలని అన్నారు. నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్ ఆండర్సన్ మాట్లాడుతూ, అణు ఆయుధాలు వాడటం వల్ల కలిగే ముప్పును గురించి ప్రజల్లో, ప్రభుత్వాల్లో అవగాహన పెంచేందుకు ఐసీఏఎన్ ఎంతో కృషి చేస్తోందని కితాబిచ్చారు.

కాగా, హిరోషిమా దాడి జరిగిన వేళ, తుర్లో వయసు 13 సంవత్సరాలు మాత్రమే. 1945, ఆగస్టు 6న అమెరికా ఈ నగరంపై అణు బాంబు వేయగా, తుర్లో కుటుంబంలోని 8 మందితో పాటు, ఆమె చదివే పాఠశాలకు చెందిన 351 మంది మరణించారు. ప్రస్తుతం ఐసీఏఎన్ 100కు పైగా దేశాల్లో ఏప్రిల్ 2007 నుంచి అణు వ్యతిరేక ప్రచారం సాగిస్తోంది.
Nobel Peace Prize
Oslo
Beatrice Fihn

More Telugu News