వైసీపీ నేత: ఏపీ అభివృద్ధికి చంద్రబాబు అవినీతే అవరోధం!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- చంద్రబాబు కారణంగా రాష్ట్రానికి నిధులు రావట్లేదు
- అవినీతి చేయడం ఎలా? అనే అంశంపై లోకేశ్ కు ట్రైనింగ్
- విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ అభివృద్ధికి చంద్రబాబు అవినీతే అవరోధమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలో నిర్వహిస్తున్న వైసీపీ రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతి కారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సక్రమంగా రావట్లేదని ఆరోపించారు. టీడీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయన, ఏపీ కేబినెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలకు బదులుగా భూసేకరణ గురించి మాత్రమే చర్చించారని విమర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ పై కూడా విమర్శలు గుప్పించారు. అవినీతి చేయడం ఎలా? అనే అంశంపై లోకేశ్ కు ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రానున్న రోజుల్లో వైసీపీదే అధికారమని విజయసాయిరెడ్డి అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నుంచి పార్టీ మారిన నేతలపై ఆయన మండిపడ్డారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి మారితే రాజీనామా చేయాలని, అలా చేయకపోవడం రాజకీయ వ్యభిచారంతో సమానమని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను మట్టి కరిపించేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.