జగన్: జగన్ పై దయతలచి రేపు ఓటు వేయవద్దు: టీడీపీ నేత మురళీమోహన్
- నాడు వైఎస్ పై ప్రజలు జాలి చూపించి ఓటు వేశారు
- అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లింది
- జగన్ కు ఓటు వేస్తే ఏపీ అన్యాక్రాంతమైపోతుంది:
వైసీపీ అధినేత జగన్ కు ప్రజలు ఓటు వేయవద్దని టీడీపీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల జంక్షన్ లో రూ.20 లక్షలతో నిర్మించిన బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, నాడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజలు జాలి చూపించి ఓటు వేయడం ద్వారా అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.
ఎండల్లో పాదయాత్ర చేస్తున్న జగన్ పై దయతలచి రేపు ఆయనకు ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ అన్యాక్రాంతమైపోతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, దీని నిర్మాణం విషయమై ప్రజలు, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. ‘పోలవరం’ నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడామని, నిధులను త్వరలో ఇస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పారు. రాజమహేంద్రవరంలో త్వరలో కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్పారు.