పవన్ కల్యాణ్: పడవ ప్రమాదం జరిగినప్పుడు విదేశాల్లో వున్నాను.. రాలేకపోయాను.. క్షమించండి!: పవన్ కల్యాణ్

  • ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు
  • బాధితులకు  ప్రభుత్వం అండగా ఉండాలి
  • నిందితులు తప్పించుకుని తిరగడం అసలైన విషాదం
  • పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన పవన్
ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన పరామర్శించారు. పడవ ప్రమాద వివరాలను మృతుల బంధువులు పవన్ కల్యాణ్ కు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, విహార యాత్రకు వెళ్తే విషాదం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో ఒక మనిషి చనిపోతేనే ఆ బాధ భరించలేమని, అలాంటిది, ఒకే కుటుంబంలా ఉన్న వాకర్స్ క్లబ్ సభ్యులు పడవ ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ప్రమాద బాధితుల బాధలను అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఎవరినీ నిందించేందుకు తాను రాలేదని, కష్టాల్లో ఉన్నప్పుడు కాస్తంత ఊరట నిచ్చేందుకే తాను వచ్చానని అన్నారు. పడవ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని, ఈ ప్రమాదానికి కారకులైన నిందితులు తప్పించుకుని తిరగడం అసలైన విషాదమని, వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

రాజకీయనాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ జరపడం కాదు, అసలు, ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాన్ని అనడం కాదు, అధికారులు మనసుపెట్టి పనిచేయాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి మున్ముందు రాకూడదని, పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కదా! అని అన్నారు. ‘ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను. అందుకే, వెంటనే రాలేకపోయాను.. క్షమించండి’ అని బాధిత కుటుంబాలతో పవన్ అన్నారు.
పవన్ కల్యాణ్
ఒంగోలు

More Telugu News