పవన్ కల్యాణ్: కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్తే ‘జనసేన’ మద్దతు ఇస్తుంది: పవన్ కల్యాణ్

  • పవన్ కల్యాణ్ ని కలిసిన కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు
  • టీడీపీ ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించలేదన్న కార్మికులు
  • సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంతో పాటు వైసీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు విఫలం: జనసేన అధినేత
విజయవాడ పర్యటనలో ఉన్న ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ని కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెండేళ్లుగా కోరుతున్నామని, 24 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పవన్ దృష్టికి తెచ్చారు. తమను క్రమబద్ధీకరిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్న టీడీపీ, నిబంధనల పేరిట సాధ్యపడదని ఇప్పుడు చెబుతోందని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు 24 గంటలపాటు విద్యుత్ ఇవ్వడంలో కాంట్రాక్టు కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, హుద్ హుద్ సమయంలో విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించిన కార్మికులం తామేనని అన్నారు. పని చేసే సమయంలో ప్రమాదాల బారినపడ్డా తమను పట్టించుకునే నాథుడే లేడని పవన్ కు చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ హయాంలో మిమ్మల్ని ఎందుకు క్రమబద్ధీకరించలేదు?’ అని కార్మికులను పవన్ ప్రశ్నించగా, ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినా ఎటువంటి ఫలితం లేదు’ అని చెప్పారు.

 సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంతో పాటు వైసీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని పవన్ విమర్శించారు. కార్మిక చట్టాలను ఎందుకు తుంగలో తొక్కుతున్నారని, కార్మికులు సమ్మెలోకి వెళ్తే ‘జనసేన’ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా పవన్ కల్యాణ్ ని కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని ఉద్యోగులు కోరారు. 2004కు ముందు చేరిన వారికి, తర్వాత చేరిన వారికి పింఛన్లు ఒకేలా ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్
‘జనసేన’

More Telugu News