Pawan Kalyan: ఇంకా ఉండాలని ఉన్నా ఉండలేకున్నా: పోలవరం వద్ద పవన్ కల్యాణ్

  • ఒక్క రోజులో పోలవరం తిరగలేను
  • అభిమానుల తాకిడి అధికంగా ఉంది
  • మరోసారి ప్రాజెక్టును సందర్శిస్తా
  • నిర్వాసితులకు అన్యాయం జరిగితే పోరాటమే
తనకు పోలవరం ప్రాజెక్టు వద్ద మరింత సమయం గడపాలని, ఇంకా తిరిగి పనులన్నీ దగ్గరి నుంచి చూడాలని కోరికగా ఉన్నప్పటికీ, ఉండలేకపోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలవరం పనులను హిల్ వ్యూ నుంచి చూసి వెనక్కు వెళ్లిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టు పనుల పరిశీలన ఒక్క రోజులో పూర్తయ్యే పని కాదని అన్నారు.

కిందకు వెళ్లి చూడాలని ఉన్నా, ఆ పని చేయలేకపోయానని, అభిమానులు అధికంగా ఉండటంతో, పోలీసులు సైతం వద్దని వారించారని తెలిపారు. మరోసారి తాను పోలవరం వస్తానని, అప్పుడు పునరావాసం ఎలా జరుగుతుందన్న విషయాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు. నిర్వాసితులకు ప్రకటించిన ప్యాకేజీలు సరిగ్గా లేవనే ప్రతి ఒక్కరూ అంటున్నారని, దీనిపై లోతుగా చర్చించాల్సి వుందని అన్నారు.

 ఇళ్లు, భూములు కోల్పోతున్న వారికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రూ. 33 వేల కోట్లను నిర్వాసితులకు ప్రకటించినా, ఆ డబ్బు తమ వద్దకు రాలేదని బాధితులు చెప్పడంతో, ఆ డబ్బు ఏ నాయకుడి వద్దకు వెళ్లినట్టు తెలిసినా తాను పోరాడుతానని అన్నారు. తాను రాజకీయాలు చేయడం లేదని, బీజేపీ, లేదా టీడీపీకి తాను వ్యతిరేకం కాదని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని తెలిపారు.
Pawan Kalyan
Polavaram
Project

More Telugu News