padmavathi: ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన 'పద్మావతి' సినిమా వివాదం
- సినిమా విడుదలను నిషేధించాలని తమిళనాడులో నిరసనలు
- కాని పక్షంలో థియేటర్ల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరికలు
- పోరాటాలు కూడా చేస్తామంటున్న తమిళనాడు విశ్వ హిందు పరిషత్
ఉత్తరాదిన రోజురోజుకీ రగులుతున్న 'పద్మావతి' చిత్ర వివాదం శుక్రవారం నాడు దక్షిణాదికి పాకింది. సినిమాలో రాజ్‌పుత్ రాణి గురించి అవాస్తవ విషయాలను పొందుపరిచి ఉంటారని తమిళనాడు హిందూ సంఘాలు ఆరోపించాయి. అందుకే చిత్ర విడుదలను తమిళనాడు ప్రభుత్వం నిలిపివేయాలని ప్రకటన కూడా విడుదల చేశారు. విశ్వ హిందు పరిషత్ కోవై జిల్లా అధ్యక్షుడు శివలింగం,రాష్ట్రీయ రాజపుత్ర కర్ణి సేన అఖిల భారత అధ్యక్షుడు సుబ్‌దేవ్‌గిల్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ సినిమా విడుదలైతే థియేటర్ల ముందు ఆందోళనలు చేస్తామని, వీలైతే పోరాటాలు కూడా చేసేందుకు సిద్ధమేనని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంలో హిందూ సమాజాన్ని, రాజ్‌పుత్ మహారాణుల గౌరవాన్ని కించపరిచే దృశ్యాలు ఉండనున్నాయనే అనుమానంతో గత కొన్ని రోజులుగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే పద్మావతి పాత్ర పోషించిన నటి దీపికా పదుకునే మీద దాడి చేసేందుకు కూడా తాము సిద్ధమేనని రాజ్‌పుత్ కర్ణి సేన సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతుందా? లేదా? అనే సందిగ్ధం ఏర్పడింది.