Padmavati: ‘పద్మావతి’ ఎఫెక్ట్: మాల్‌ను ధ్వంసం చేసిన కర్ణిసేన

  • రోజురోజుకు పెరుగుతున్న ‘పద్మావతి’ సెగలు
  • మాల్‌ను ధ్వంసం చేసిన కర్ణిసేన కార్యకర్తలు
  • ఎనిమిదిమంది అరెస్ట్
ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ బాలీవుడ్‌లో ‘పద్మావతి’ సినిమా సెగలు చల్లారడం లేదు. ఈ సినిమాపై తొలి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రాజ్‌పుట్ కర్ణిసేన నిరసనలను మరింత ఉద్ధృతం చేసింది. మంగళవారం ఇవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. ‘పద్మావతి’ ట్రైలర్ విడుదలపై రెచ్చిపోయిన ఆందోళనకారులు రాజస్థాన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. కోటలో ఆకాశ్ మాల్‌పై విరుచుకుపడిన ఆందోళనకారులు దానిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మాల్ విధ్వంసంపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ మాట్లాడారు. పద్మావతి సినిమాపై వారికేమైనా అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా నిరసనలు తెలపుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకానీ ఇలా హింసాత్మక ఘటనలకు పూనుకోవడం సరికాదన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
Padmavati
Bollywood
Rajput Karni Sena

More Telugu News