కోమటిరెడ్డి: అధికార పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణ
- అధికార పార్టీపై కోమటిరెడ్డి ఆరోపణలు
- పోలీస్ వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది
- స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే నడుచుకుంటున్న పోలీస్ అధికారులు
తెలంగాణ అధికార పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని, పార్టీ కండువా కప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణ, శాంతి భద్రతల నిర్వహణ’ అనే అంశంపై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ప్రతిపక్షాలపై అనవసర కేసులు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడంతో సభలో దుమారం రేగింది.
స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే నడుచుకోవాలని, లేకుంటే తమను బదిలీ చేస్తారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఒత్తిడి భరించలేక సదరు పోలీస్ అధికారులు సెలవులపై వెళ్లిపోతున్నట్టు పలువురు అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.