సీఎం చంద్రబాబు: పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

  • ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
  • నిందితులు కొండల్ రావు, గేదెల శ్రీను సహా ఐదుగురిపై కేసు నమోదు
  • బోటుకు అనుమతి లేదు.. డ్రైవర్ కు అనుభవం లేదు
  •  బాధితులను కాపాడిన మత్స్యకారులకు ఆర్థిక సాయం: బాబు
విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం కృష్ణా పవిత్ర సంగమం వద్ద నిన్న జరిగిన పడవ ప్రమాదం మృతులకు ఏపీ అసెంబ్లీలో సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చంద్రబాబు ఓ ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. భవిష్యత్తులో బోటు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

నిందితులు కొండల్ రావు, గేదెల శ్రీను సహా ఐదుగురిపై కేసు నమోదు చేశామని, టూరిజం డిపార్ట్ మెంట్ అధికారులు చెప్పినా వినకుండా బోటు నడిపారని, భయంతో అందరూ ఒకవైపు ఒరగడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పారు. బోటుకు అనుమతి లేదని, దానిని నడిపిన డ్రైవర్ కు అనుభవం లేదని, ఈ ఘటనపై ఐఏఎస్, ఐపీఎస్ తో విచారణ కమిటీ వేస్తామని చెప్పారు.

 ఈ ప్రమాదంలో బాధితులను కాపాడిన మత్స్యకారులు పిచ్చయ్య, శివయ్యకు చంద్రబాబు అభినందనలు తెలుపుతూ, వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. కాగా, ప్రమాదానికి గురైన బోటును నడిపిన గేదేల శ్రీనుపై ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. పర్యాటక శాఖలో కాంట్రాక్టు డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనుని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బోట్ ఆపరేటర్లతో సచివాలయంలో రేపు సమావేశం నిర్వహిస్తామని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా చెప్పారు.
సీఎం చంద్రబాబు
ఎక్స్ గ్రేషియా

More Telugu News