Pervez Musharraf: ముషారఫ్ కొత్త ఎత్తుగడ.. 23 పార్టీలతో కొత్తగా మహా కూటమి ఏర్పాటు

  • వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలే లక్ష్యం
  • ఇమ్రాన్ ఖాన్ పార్టీ సహా ప్రముఖ  పార్టీలకు ఆహ్వానం
  • మహా కూటమి సెక్రటరీ జనరల్‌గా ఇక్బాల్ దార్
పాకిస్థాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ శనివారం 23 పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న ముషారఫ్ మహా కూటమిని ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను ఎదుర్కోవడమే లక్ష్యంగా మహాకూటమి పురుడు పోసుకుంది. పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్ (పీఏఐ) పేరుతో వస్తున్న ఈ కూటమికి 74 ఏళ్ల ముషారఫ్ సారథ్యం వహించనున్నారు. ఈ కూటమికి ఇక్బాల్ దార్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ముషారఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అన్ని పార్టీలు ఈ కూటమిలో చేరాలని అభ్యర్థించారు. ముఖ్యంగా ముత్తాహితా క్వామి మూమెంట్ (ఎంక్యూఎం), పాక్ సర్జామీన్ పార్టీ (పీఎస్‌పీ)లను తమతో చేతులు కలపాల్సిందిగా కోరారు. ప్రస్తుతం పాక్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ (పీటీఐ)ని కూడా తమతో కలిసి రమ్మని ఆహ్వానించారు.
Pervez Musharraf
Pakistan
Grand alliance

More Telugu News