Women's Ashes: ‘యాషెస్‌’లో అదరగొట్టిన ఎలిస్ పెర్రీ.. రెండు పరుగుల తేడాతో మిథాలీ రికార్డు సేఫ్!

  • అజేయంగా డబుల్ సెంచరీ బాదిన ఎలిస్ పెర్రీ
  • అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మూడో బ్యాట్స్ విమెన్
  • తొలి సెంచరీనే ‘డబుల్’గా మలిచిన పెర్రీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ అద్భుత ఆటతీరుతో రికార్డు సృష్టించింది. 374 బంతుల్లో 26 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 213 పరుగులు చేసింది. ఫలితంగా మహిళా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. 242 పరుగులతో పాకిస్థాన్ బ్యాట్స్ విమెన్ కిరణ్ బలూచ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ 214 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎలిస్ పెర్రీ కనుక మరో రెండు పరుగులు సాధించి ఉంటే మిథాలీ రికార్డు బద్దలై ఉండేది.

ఇక ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ విమెన్ ఎలిస్ పెర్రీనే. 209 పరుగులతో ఇప్పటి వరకు ఈ రికార్డును సొంతం చేసుకున్న కారెన్ రోల్డన్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. కాగా, పెర్రీకి మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఇదే తొలి శతకం కావడం గమనార్హం.

More Telugu News