banned: రద్దయిన పెద్ద నోట్లన్నీ ఏమయ్యాయో తెలుసా?... హార్డ్‌బోర్డుల రూపంలో దక్షిణాఫ్రికాకు వెళ్లాయి!
- 2019 దక్షిణాఫ్రికా ఎన్నికల్లో ఈ హార్డ్‌బోర్డులను ఉపయోగించనున్నారు
- వెల్లడించిన కేరళలోని ప్లైవుడ్ కంపెనీ
- 800 టన్నుల నోట్లను హార్డ్‌బోర్డులుగా మార్చిన వెస్ట్రన్ ఇండియన్ ప్లైవుడ్ లిమిటెడ్
నోట్ల రద్దుకు రేపటితో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో దేశప్రజలంతా లైన్లలో నిలబడి మరీ డిపాజిట్ చేసిన పాత నోట్లన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం సాధారణమే.. ఇంతకీ అవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా... దక్షిణాఫ్రికాలో! 2019లో అక్కడ జరగబోయే ఎన్నికల్లో ఈ నోట్లే కీలకపాత్ర పోషించబోతున్నాయి. కానీ కరెన్సీ రూపంలో కాదు... హార్డ్‌బోర్డుల రూపంలో!
అవును... పాత నోట్లన్నింటినీ రీసైకిల్ చేసి ప్రచారం కోసం ఉపయోగించే హార్డ్‌బోర్డ్‌లుగా మార్చినట్లు కేరళలోని కన్నూర్ ప్రాంతంలో ఉన్న వెస్ట్రన్ ఇండియన్ ప్లైవుడ్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. తమ దగ్గరికి దాదాపు 800 టన్నుల పాత నోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చాయని, వాటన్నింటినీ హార్డ్‌బోర్డులుగా మార్చి దక్షిణాఫ్రికా పంపించినట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పి. మెహబూబ్ తెలిపాడు.