revant reddy: రేవంత్ పై చంద్రబాబు నిర్ణయమేంటి?... ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ!

  • టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • ఏం జరిగిందో వివరించిన ఎల్ రమణ 
  • రేవంత్ వైఖరిని విమర్శిస్తూ ఆరోపణలు
  • బాబు నిర్ణయమే కీలకం!
గత కొన్ని రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య జరుగుతున్న ఆరోపణ, ప్రత్యారోపణల పర్వానికి తెరతీయాలన్న ఉద్దేశంతో తన తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని రాగానే రంగంలోకి దిగిన చంద్రబాబు, నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ ఇతర నేతలు నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, సీతక్క, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులతో పాటు మొత్తం వివాదానికీ కేంద్ర బిందువైన రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

వీరందరితో మాట్లాడిన చంద్రబాబు, ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలను ఎల్ రమణ వివరించినట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని, వెళ్లే ముందు ఇంతకాలం అన్నంపెట్టిన పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాస్తంత కటువుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎల్ రమణ చేస్తున్న ఆరోపణలను రేవంత్ అడ్డుకోబోగా, చంద్రబాబు కల్పించుకుని తనకన్నీ తెలుసునని ఒకింత ఆగ్రహంగా అన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం ముగియగా, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News