జనసేన: హైదరాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • శాస్త్రోక్తంగా పూజలు..సర్వమత ప్రార్థనలు
  • కొత్త హంగులు సంతరించుకున్న ‘జనసేన’ కార్యాలయం
  • ప్రతి విభాగాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్
హైదరాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ప్రారంభించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించామని, అనంతరం, కొత్త హంగులు సంతరించుకున్న కార్యాలయంలో పరిపాలనా కార్యక్రమాలను ప్రారంభించినట్టు తెలిపింది.

 పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పని చేస్తుందని, పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం విశాలమైన స్థలంలో హైదరాబాద్, అమరావతి నగరాలలో వేరేగా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తొలుత శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన లాంఛనాలన్నీ పూర్తయిన అనంతరం, కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసేన కార్యకర్త నిమ్మల వీరన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, విద్యా రంగ ప్రముఖులు, సినీ ప్రముఖులు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎస్. రాధాకృష్ణ, ప్రముఖ రచయిత సత్యానంద్, ప్రముఖ హాస్యనటుడు అలీ, పవన్ కల్యాణ్ అభిమానులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలుగులో రాసిన ఖురాన్ ని నటుడు అలీ బహూకరించాడు. 

More Telugu News

జనసేన
పవన్ కల్యాణ్