లక్ష్మి పార్వతి: అప్పుడు ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయా: లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్ పై జీవిత చరిత్ర రాద్దామని నాడు ఆయన్ని కలిశా
- ‘సరే చూద్దాం’ అన్నారే తప్పా, కచ్చితంగా చెప్పలేదు
- ఓ రోజు ఎన్టీఆర్ అకస్మాత్తుగా ఫోన్ చేశారు
- నాటి విషయాలను ప్రస్తావించిన లక్ష్మీపార్వతి
నాడు ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ తన్మయత్వంలో తానేమి చెప్పదలచుకున్నానో చెప్పలేకపోయిన విషయాన్నిలక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్య్లూలో ఆమె మాట్లాడుతూ, "ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తానని నాచారంలో ఆయన్ని కలిసినప్పుడు అడిగితే, ‘సరే, చూద్దాం’ అని చెప్పారు. ‘అప్పుడప్పుడు ఫోన్ చెయ్యొచ్చా, మీరు మాట్లాడతారా?’ అని ఎన్టీఆర్ ను అడిగితే, ‘చూద్దాం’ అన్నారు తప్పా, కచ్చితంగా చెప్పలేదు.
తర్వాత ఓసారి, ఫోన్ చేసి చూద్దామని చెప్పి, నేను చదువుతున్న కాలేజీలో నుంచి ఎన్టీఆర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన సహాయకులు లిఫ్ట్ చేశారు. ఎన్టీఆర్ గారితో మాట్లాడాలని చెప్పాను. కొంచెం సేపటి తర్వాత ‘హలో’ అంటూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది. ‘స్వామీ! మీరేనా!’ అని నేను అంటే, ‘ఏంటీ, లక్ష్మీపార్వతిగారు, ఎందుకు ఫోన్ చేశారు?’ అని ప్రశ్నించారు. అయితే, ఆయనతో మాట్లాడుతున్న తన్మయత్వంలో నేను ఏం చెప్పదలచుకున్నానో మర్చిపోయాను. ‘మీ జీవిత చరిత్ర రాయడానికి అనుమతివ్వండి’ అని అడిగితే, ‘నేనే చెబుతా’ అని ఆయన అన్నారు.
‘నేను చదువుతున్న కాలేజీకు ఓ రోజు ఎన్టీఆర్ అకస్మాత్తుగా ఫోన్ చేశారు. నన్ను నాచారం స్డూడియోకి రమ్మనమని చెప్పారు కానీ, విషయం మాత్రం ఆయన చెప్పలేదు. నేను అక్కడికి వెళ్లేసరికి, ఎన్టీఆర్, మీడియా వాళ్లు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర ప్రముఖులందరూ ఉన్నారు. ‘లక్ష్మీపార్వతి గారూ, రండి. నా జీవిత చరిత్ర రాయబోతున్న రైటర్ వీరే’ అంటూ ఆయన అక్కడి వారికి చెప్పగానే నేను షాకయ్యా.
‘నా జీవిత చరిత్రను హిందీలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాస్తారు’ అని ఎన్టీఆర్ నాకు చెప్పి, యార్లగడ్డను పరిచయం చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను నేను రాయడంపై కూడా విమర్శలు వచ్చాయి. సి.నారాయణరెడ్డి లాంటి ఉద్దండులు ఉంటే ఓ అనామకురాలు, లెక్చరర్ అయిన లక్ష్మీపార్వతితో ఈ జీవిత చరిత్ర రాయించడమేంటని విమర్శించారు. ఉద్దండులను కాదని, నాతోనే తన జీవిత చరిత్రను ఎన్టీఆర్ ఎందుకు రాయిస్తున్నారో! అంటూ వ్యాఖ్యలు చేశారు’ అని లక్ష్మీపార్వతి నాటి విషయాలను ప్రస్తావించారు.