లక్ష్మి పార్వతి: ఆ మాటలు ఎన్టీఆర్ తో అనగానే ఆయన ముఖంలో కళ వచ్చింది: లక్ష్మీపార్వతి
- నాడు ఎన్టీఆర్ ని కలిసేందుకు నాచారం స్టూడియోకు వెళ్లా
- పడక కుర్చీలో ఎన్టీఆర్ దిగులుగా కూర్చున్నారు
- అసలు వయసు కంటే నాలుగైదేళ్ల ఎక్కువ వయసున్న వారిలా కనిపించారు
- ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి
దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, హైదరాబాద్ తెలుగు యూనివర్శిటీలో నాడు ఎం.ఫిల్ లో తనకు సీటొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ని కలిసేందుకు వెళ్లానని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాలుగైదు సార్లు ఆయన్ని కలిశానని చెప్పారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ బిజీ అయిపోవడం, ఆ ఎన్నికల్లో వారి పార్టీ ఓడిపోవడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ఎన్టీఆర్ ని కలిసి ఆయనతో మాట్లాడాలని తాను చాలా తపన పడ్డానని అన్నారు.
‘ఆబిడ్స్ లోని ఆయన నివాసానికి నేను ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆయన నాచారంలో ఉంటున్నారని అక్కడి వాళ్లు చెప్పారు. నాచారంలో ఆయన ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్లాను. చివరకు, నాచారం స్డూడియోకు వెళ్లాను. అక్కడి వరండాలో పడక కుర్చీలో ఎన్టీఆర్ కూర్చుని ఉన్నారు.
అసలు వయసు కంటే నాలుగైదేళ్ల వయసు ఎక్కువ వయసు వారిలా, చాలా భారంగా అప్పుడు ఆయన ఉన్నారు. నేను ఆ వరండాలోనే కింద కూర్చున్నాను. ‘లక్ష్మీపార్వతి గారు, కుర్చీలో కూర్చోండి’ అని ఎన్టీఆర్ అన్నారు. ‘వద్దు స్వామీ కిందే కూర్చుంటాను’ అంటూ ఆయనకు నమస్కారం చేశాను. ‘స్వామీ! ఎందుకలా ఉన్నారు? ఎన్నికల్లో ఓడిపోయారని బాధపడుతున్నారా?’ అని అడిగా. ‘అదేం లేదు, దాని గురించి పెద్ద బాధ లేదు. నేను బాధపడే మనిషిని కాదు’ అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారని లక్ష్మీపార్వతి అన్నారు.
‘మీరు ఉత్సాహంగా లేరు. నేను చిన్నదానిని అయినప్పటికీ, మీకో మాట చెబుతాను. దయచేసి, ఏమీ అనుకోవద్దు. ‘అధికారమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అధికారం కోసం మీరు వెతుక్కుంటూ పోలేదు. జరిగిన లోపాలను పరిశీలించుకోవడానికి దొరికిన అవకాశంగా ఈ ఓటమిని మీరు భావించండి స్వామి. అంతేతప్పా, మీరు ఓడిపోయారని అనుకోవద్దు. అది ప్రజల దురదృష్టం’ అని ఎన్టీఆర్ తో నేను అనగానే ఆయన ముఖంలో కొంచెం కళ వచ్చింది’ అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.