hockey: పాక్ చిత్తు... ఆసియా కప్ హాకీ ఫైనల్ లో భారత్!
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరుగుతోన్న ఆసియా కప్ హాకీలో భారత్ ఈ రోజు కూడా తన దూకుడుని కొనసాగించింది. మౌలానా భసానీ హాకీ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్ లో భాగంగా 4-0 తేడాతో పాక్‌పై విజయ దుందుభి మోగించింది. పాక్ జట్టుని కనీసం ఖాతా కూడా తెరవనివ్వకుండా భారత్ టీమ్ ఆడిన తీరు భారత అభిమానులను హుషారెత్తించింది. భారత ఆటగాడు షబ్బీర్ సింగ్ మొదటి గోల్ చేయగా, హర్మన్‌ప్రీత్ సింగ్ రెండోగోల్ చేశాడు. అనంతరం నిమిషం వ్యవధిలోనే లలిత్ ఉపాధ్యాయ మరో గోల్ చేశాడు. అనంతరం గుర్జాంత్ సింగ్ గోల్ చేశాడు. భారత ఆటగాళ్ల స్వైర విహారం చూసిన పాక్.. ఆటలో తీవ్ర ఒత్తిడిని అనుభవించింది. ఈ గెలుపుతో ఆసియాకప్ హాకీ ఫైనల్లోకి భారత్ ప్రవేశించింది.