స్మృతి ఇరానీ: కజకిస్థాన్, రష్యా, ఇండోనేషియా ఎన్నికల్లో గెలవాలని రాహుల్ ప్రయత్నాలు: స్మృతి ఇరానీ చురకలు
- రాహుల్ ట్వీట్లకు ఏకంగా 2,784 రీట్వీట్లు
- రాహుల్ గాంధీ ట్విట్టర్‌బాట్ ను ఉపయోగిస్తున్నారని ఓ వార్తా సంస్థ కథనం
- స్మృతి ఇరానీ సెటైర్లు
ట్విట్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 35.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి 3.83 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ లో మోదీ ట్వీట్లకు 2,506 రీట్వీట్లు వస్తే, రాహుల్ ట్వీట్లకు మాత్రం 2,784 రీట్వీట్లు వచ్చాయి. అంతేగాక, రెండు నెలల్లో రాహుల్ గాంధీ ఫాలోయర్ల సంఖ్య దాదాపు ఒక మిలియన్ పెరిగింది. ఈ విషయంపై ఓ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురిస్తూ... ట్వీటింగ్, రీట్వీటింగ్, లైకింగ్, ఫాలోయింగ్, అన్‌ఫాలోయింగ్, మెసేజింగ్ వంటి వాటిని తనంతట తానే నిర్వహించగలిగే సాఫ్ట్‌వేర్ (ట్విట్టర్‌బాట్)ను రాహుల్ గాంధీ ఉపయోగిస్తున్నారని తెలిపింది.
అందుకే రాహుల్ గాంధీకి ఇన్ని రీట్వీట్లు వచ్చేశాయని పేర్కొంది. ఆఫీస్ఆఫ్ఆర్‌జీ అనే పేరుతో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగిస్తారు. ఆ ట్విట్టర్ ఖాతా నుంచి వస్తోన్న ట్వీట్లను కజకిస్థాన్, ఇండోనేషియా, రష్యాల నుంచి ఆటోమేటెడ్ బాట్స్ రీట్వీట్ చేస్తున్నాయని ఆ వార్త సంస్థ తెలిపింది. రాహుల్ ట్విట్టర్ ఖాతాపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనపై సెటైర్లు వేశారు. కజకిస్థాన్, రష్యా, ఇండోనేషియా ఎన్నికల్లో గెలవాలని ఆఫీస్ఆఫ్ఆర్‌జీ ప్రయత్నాలు జరుపుతున్నట్లున్నారని ఆమె చురకంటిస్తూ ట్వీట్ చేశారు.