: 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుతున్న చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేబట్టిన 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్ర ఈ రోజు 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుతోంది. గత అక్టోబర్ రెండున అనంతపురం జిల్లా హిందూపురంలో ఆయన ఈ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఇప్పటి వరకు 12 జిల్లాలను పూర్తి చేసి, 13 వ జిల్లా అయిన గుంటూరులో బాబు పాదయాత్ర చేస్తున్నారు.
ఈ యాత్ర 107 పట్టణాలు... రెండు నగరాలు... 107 మండలాలు... 55 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. శారీరకంగా అలసట చెందుతున్నా, షుగర్ వ్యాధి బాధిస్తున్నా, వైద్యులు విరమించుకోమని వారిస్తున్నా... మొక్కవోని దీక్షతో బాబు సాగిస్తున్న ఈ పాదయాత్ర నేడు గుంటూరులోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకునే సరికి 2000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో ఆయన ప్రజలతో మమేకమై వారి సాధకబాధకాలను తెలుసుకుంటూ ... 'మీ కోసం నేనున్నా'నంటూ భరోసా ఇస్తున్నారు!