Revanth reddy: రేవంత్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం... అధిష్ఠానానికి టీకాంగ్రెస్ నేతల ఫిర్యాదుల వెల్లువ!

  • పార్టీలో చేరుతున్నట్టు తెలిసిన వెంటనే ఫిర్యాదుల పరంపర
  • మచ్చపడిన నేతను చేర్చుకుంటే పార్టీకి చేటని ఫిర్యాదు
  • పదవి కోసం అధిష్ఠానంతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణ
తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు మంగళవారం మీడియా ఊదరగొట్టింది. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమైంది. ఈ వార్త హల్‌చల్ చేస్తుండగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. ఓటుకు నోటు కేసులో విశ్వసనీయత పోగొట్టుకున్న వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అలా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

కాంగ్రెస్ అధిష్ఠానంతో రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్నారని, పలువురు సీనియర్ నేతలను తనతోపాటు పార్టీలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారని, అందుకు ప్రతిగా తనకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కానీ, పార్టీ ఎన్నికల ప్రచారం సంఘం అధ్యక్ష పదవి కానీ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారని నాయకులు చెబుతున్నారు. ఫిర్యాదుల విషయమై స్పందించిన కుంతియా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయాన్ని తమకు వదిలివేయాలని నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది.
Revanth reddy
Telugudesam
congress
telangana

More Telugu News