చంద్రబాబు: చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి వద్దు: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు చంద్రబాబు సూచన
- విద్యార్థులు ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలి
- ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది
- విశ్వవిద్యాలయాల్లో ‘తెలుగు’ను తప్పనిసరి చేస్తామన్న చంద్రబాబు
చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. విజయవాడలో జరిగిన ప్రతిభా అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. విద్యార్థులు ఇష్టపడి చదివేలా వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి చేస్తే వారు ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరం మేరకు వినియోగించుకోవాలని సూచించిన చంద్రబాబు, తెలుగు భాషకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషను తప్పనిసరి చేసేలా త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.