నాగార్జున: ఈ సినిమా హిట్ కాకపోతే నేను, సమంత ఒకరిముఖం ఒకరం ఎలా చూసుకోవాలి?: జోకులేసిన నాగార్జున

  • ప్రెస్ మీట్లో జోకులు వేసిన నాగార్జున
  • చైతూ, సమంతల పెళ్లి తరువాత వస్తోన్న తొలిసినిమా హిట్ కావాలి
  • ఓంకార్ బాగా కష్టపడ్డాడు 
  • సినిమా అంటే ఓంకార్ కి విపరీతమైన ప్రేమ
ప‌ది రోజుల క్రితం ఇక్క‌డే ఈ సినిమా గురించి చాలా మాట్లాడానని, మ‌ళ్లీ ఇప్పుడు మాట్లాడుతున్నానని సినీన‌టుడు నాగార్జున అన్నారు. ‘రాజుగారి గ‌ది-2’ సినిమా రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ రోజు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాగార్జున మాట్లాడుతూ... ఈ సినిమా బాగుంది అన్న పాజిటివ్ టాక్ అప్పుడే రావడం వల్లే.. న‌టీన‌టులు అంద‌రూ వచ్చి తన పక్కన కూర్చున్నారని చుర‌క‌లంటించారు. ఈ సినిమాలో న‌టించిన వారిని అభినందించారు. త‌న కోడ‌లు స‌మంత త‌న కంటే బాగా చేసిందని అన్నారు.

ఈ సినిమా తనకు చాలా స్పెష‌ల్ అని, ఎందుకంటే అక్టోబ‌ర్ 6న స‌మంత‌, చైతూ పెళ్ల‌యిందని, ఈ సినిమా హిట్ కాక‌పోతే స‌మంత‌, తాను ఒక‌రిముఖం ఒక‌రం ఎలా చూసుకుంటామ‌ని చ‌మ‌త్క‌రించారు. వారి పెళ్లయ్యాక తనకు హిట్ వ‌చ్చింద‌ని అంద‌రూ చెప్పుకోవాలని అన్నారు.

ఈ సినిమా కోసం ఓంకార్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్పారు. ఓంకార్‌కి చిన్న ప్రాబ్లం ఉందని, ఓసీడీ (చాద‌స్తంగా చేసిన పనే చేసే మాన‌సిక‌ వ్యాధి) తో బాధ ప‌డ్డాడ‌ని తెలిపారు. ఓసీడీ సినిమా మీద ఉంద‌ని, దానిపై విప‌రీతమైన ప్రేమ, సీన్లు మంచిగా వ‌చ్చేవ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ చేయడం అని అన్నారు.

ఓంకార్ అంద‌రినీ చంపేశాడ‌ని, ఆల్రెడీ అంద‌రూ దెయ్యాల‌యిపోయారని నాగార్జున చ‌మ‌త్క‌రించారు. షూటింగ్ అయిపోయిన త‌రువాత‌ ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్లిపోయానని అన్నారు. రేపు ఓంకార్ ప‌డిన క‌ష్టానికి, త‌పనకి, శ్ర‌మ‌కి ఫ‌లితం వ‌స్తుంద‌ని చెప్పారు. న‌వ్వుకుంటూ జోకులేసుకుంటూ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నామ‌ని చెప్పారు.
నాగార్జున

More Telugu News