వర్షం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- మరఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమకు ఉపరితల ఆవర్తనం
- ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిండిన చెరువులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమకు ఉపరితల ఆవర్తనం ఉందని, ఈ ప్రభావంతోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ రోజు, రేపు భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. నిన్న హైదరాబాద్, అనంతపురం, నెల్లూరు, కర్నూలు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెరువులు నిండి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రాయలసీమ, కోస్తాల్లోని పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.