కంచ ఐలయ్య: కంచ ఐలయ్యను బెదిరించడాన్ని ఖండిస్తున్నాం: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్
- ఓ ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు నేత
- భావ ప్రకటనా స్వేచ్ఛను ఎదుర్కొనే హక్కు ఎవరికీ లేదు
- సంఘ్ పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమే ఇదంతా
- తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్న మోదీ, కేసీఆర్
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం రాసి వివాదాల్లో పడ్డ పుస్తక రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ పుస్తకం ఉందని, వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తుండటం, ఆర్యవైశ్యులకు రెండు రాష్ట్రాల్లో మద్దతు లభిస్తుండటం తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలో కంచ ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నామంటూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కంచ ఐలయ్య రాసిన విషయాలపై అభ్యంతరం ఉంటే చర్చించాలని, ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. సంఘ్ పరివార్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం..హిందూ ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య, కంచ ఐలయ్యపై దాడులు జరగడం సంఘ్ పరివార్ హత్యారాజకీయాల్లో భాగమేనని, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని , కంచ ఐలయ్య పుస్తకం లేకుండా చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారని మావోయిస్టు నాయకుడు జగన్ ఆ ప్రకటనలో విమర్శించారు.