అమిత్ షా: ‘రాహుల్ బాబా’ అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిపై అమిత్ షా చురకలు
- ఉత్తర ప్రదేశ్, అమేథీలో బీజేపీ భారీ బహిరంగ సభ
- కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విమర్శలు
- మూడు తరాలుగా అమేథీ ప్రజలు నెహ్రూ కుటుంబ నేతలకు ఓట్లు వేస్తున్నారు
- ఆ పార్టీ నేతలు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ‘రాహుల్ బాబా’గా అభివర్ణించారు. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో ఈ రోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా అమేథీ ప్రజలు నెహ్రూ కుటుంబ నేతలకు ఓట్లు వేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతలు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు.
అమేథీలో ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ లేదని, క్షయ రోగులకు వైద్యం చేయడానికి ఆసుపత్రి లేదని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు లేవని అమిత్ షా అన్నారు. ‘నేను రాహుల్ బాబాను అడుగుతున్నాను. నెహ్రూ కుటుంబ నేతలకు మూడు తరాల నుంచి ఇక్కడి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. వారిపై కృతజ్ఞత చూపించే విధానం ఇదేనా?’ అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఆ కుటుంబంపైనే నమ్మకంతో ఉన్న ప్రజలు ఇకపై మోదీ, బీజేపీపై నమ్మకం పెట్టుకోవాలని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ స్మృతి ఇరానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ.. ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడమే మానేశాడని, ఇంతటి నిర్లక్ష్యపు ఎంపీని తాను ఎక్కడా చూడలేదని అన్నారు. ‘2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం మొత్తం 106 పథకాలను ప్రారంభించింది. రాహుల్ బాబాకి 106 అంకెలు కూడా సరిగ్గా లెక్కపెట్టడం రాదు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు.