revanth reddy: 'తాగుబోతు మాటలు మాట్లాడుతావా?' అంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

  • తాగుబోతైనా పధ్ధతిగా మాట్లాడుతాడు
  • తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ వీరులు, కోదండరాం తెలంగాణ ద్రోహా?
  • వాడు, వీడు అని మాట్లాడుతావా? నీ ఇంటికి కోదండరాం ఇల్లు ఎంత దూరమో.. కోదండరాం ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకో!
'తాగుబోతు మాటలు మాట్లాడుతావా?' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు అధికారం అప్పగించగానే కేసీఆర్ సర్వం తానేనని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రొఫెసర్ కోదండరామ్ ను వాడు, వీడు అని సంబోధిస్తూ కేసీఆర్ మాట్లాడడం సబబా? అని ప్రశ్నించారు. అయినా కోదండరాం తప్పు ఏం మాట్లాడారని ఆయన నిలదీశారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాల అనైక్యత వల్లే టీఆర్ఎస్ గెలిచిందని ఆయన అన్నారు. తామంతా ఏకతాటిపైకి వస్తే టీఆర్ఎస్ గెలిచేదా? అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ ఇంటికి కోదండరాం ఇల్లు ఎంత దూరమో.. కోదండరాం ఇంటికి కేసీఆర్ ఇల్లు కూడా అంతే దూరమని ఆయన గుర్తు చేశారు. నువ్వు వాడు, వీడు అని మాట్లాడితే నిన్ను ఎలా సంబోధించాలని ఆయన ప్రశ్నించారు. తాగుబోతు అయినా తల్లిని తల్లి, చెల్లిని చెల్లి అంటాడని, కానీ నువ్వు మాత్రం అలా కాదని ఆయన మండిపడ్డారు.

ఇందుకేనా, తెలంగాణ ప్రజలు నీకు పట్టం కట్టింది? అని ఆయన నిలదీశారు. పేదోడికి మేలు చెయ్యాలన్న టీడీపీ విధానం నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం మానేసి, తెలంగాణలో టీడీపీ లేదని అంటావా? అని ఆయన ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలంగాణ వీరులు, కోదండరాం దేశద్రోహా? అని ఆయన నిలదీశారు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అని ఆయన అడిగారు. సంస్కారహీనంగా మాట్లాడవద్దని, తెలంగాణ ప్రజలు ఇందుకు అధికారం అప్పగించలేదని ఆయన తెలిపారు. 
revanth reddy
Telugudesam
hydarabad

More Telugu News