braid chopper: కాశ్మీర్లో జడలు కత్తిరించేస్తున్నాడని 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి.. పరిస్థితి విషమం

  • లోయలో పెరిగిపోతున్న జడల కత్తిరింపు కేసులు
  • పోలీసులకు సవాలుగా మారిన వైనం
  • కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
జమ్ముకశ్మీర్‌లో ఇటీవల మహిళల జడల కత్తిరింపు హాట్ టాపిక్‌గా మారింది. తొలుత ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ఈ జడల కత్తిరింపు తర్వాత ఢిల్లీకి, అనంతరం జమ్ముకశ్మీర్‌కు మారింది. ఈ పని ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు సైతం తలలు బద్దలు గొట్టుకుంటున్న వేళ అనంతనాగ్‌లో 70 ఏళ్ల వృద్ధుడిని అనుమానంతో చితకబాదారు. ప్రస్తుతం అతడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

గత నెలలో లోయలో జడల కత్తిరింపు కేసులు 80కి పైగా నమోదయ్యాయి. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మహిళల జడలతోపాటు మగాళ్ల గెడ్డాలను కూడా కత్తిరిస్తున్నారు. దీంతో మహిళలు, పురుషులు వీధిలోకి రావాలంటేనే భయపడుతున్నారు.

కాగా, అనంతనాగ్‌కు చెందిన అబ్దుల్ సలామ్ వనీనే  గెడ్డాలు, జడలు కత్తిరించేస్తున్నాడని పొరపాటు పడిన కొందరు అతడిపై ఇటుకలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే అనంతనాగ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

సలీంపై దాడిచేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, వారిని గుర్తించేందుకు ప్రజలు సహకరించడం లేదని ఐజీ మునీర్ ఖాన్ తెలిపారు. జడల కత్తిరింపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా పోలీస్ చీఫ్ ఎస్పీ వేద్‌ను ఆదేశించారు.
braid chopper
lynched
Kashmir
Anantnag

More Telugu News