జీెఎస్టీ: నేటి జీఎస్టీ కౌన్సిల్ సదస్సులో కీలక నిర్ణయాలు ఇవిగో!
- అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సదస్సు
- 1.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగి ఉంటే ఇకపై మూడు నెలలకు ఓసారి రిటర్న్స్ దాఖలు చేయొచ్చు
- ఆభరణాలకు సంబంధించి విడుదల చేసిన జీఎస్టీ నోటిఫికేషన్ తొలగింపు
- చిన్నతరహా పరిశ్రమలు, ఎగుమతులపై ప్రధానంగా చర్చ
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. నాన్ -కంపోజిషన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే జీఎస్టీ చెల్లింపు దారులు 1.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగి ఉంటే నెలకి ఒకసారి వేస్తోన్న జీఎస్టీ రిటర్న్స్ ఇకపై మూడు నెలలకు ఒకసారి వేయవచ్చని చెప్పారు. ఆపై టర్నోవర్ ఉంటే మాత్రం నెలకి ఒకసారి జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
అలాగే, ఏసీ రెస్టారెంట్లపై వేస్తోన్న జీఎస్టీని మరోసారి సమీక్షించి, పన్ను తగ్గించేందుకు మంత్రులతో సబ్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ చెప్పారు. పదిరోజుల్లో ఈ విషయంపై కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. ఏసీ రెస్టారెంట్లపై విధిస్తోన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ రోజు జరిపిన సదస్సులో చిన్నతరహా పరిశ్రమలు, ఎగుమతులపైనే ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పారు. వస్తువుల ఎగుమతిదారులపై వేస్తోన్న ఐజీఎస్టీకి 6 నెలల పాటు మినహాయింపు ఇచ్చే అంశంపై కూడా చర్చించినట్లు తెలిపారు.
ఆభరణాలకు సంబంధించి విడుదల చేసిన జీఎస్టీ నోటిఫికేషన్ను ప్రస్తుతం తొలగిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. వచ్చేనెల గౌహతిలో నిర్వహించనున్న తదుపరి సదస్సులో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అలాగే, రూ.50 వేలకు పైగా విలువ చేసే నగల కొనుగోలుకు పాన్, ఆధార్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు.