Nellore: నెల్లూరు చిన్నోడు ఇరగదీశాడు.. రెండు వారాల వ్యవధిలో రెండు ట్రిపుల్ సెంచరీలు బాదేశాడు!

  • ఆంధ్ర క్రికెట్ సంఘం చరిత్రలో రికార్డు
  • ఒకే టోర్నీలో రెండుసార్లు ఈ ఘనత సాధించిన రేవంత్
  • భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు

కుదిరితే సెంచరీ, లేదంటే కనీసం హాఫ్ సెంచరీ.. క్రీజులోకి దిగే ప్రతి ఆటగాడు కోరుకునేది ఇదే. టోర్నీ ఏదైనా, ఏ స్థాయి మ్యాచ్ అయినా పరుగుల వరద పారించాలనే అనుకుంటారు. అంతర్జాతీయ క్రికెటర్ నుంచి గల్లీ క్రికెటర్ వరకు అందరూ ఆలోచించేది ఇదే. అయితే ఒకే టోర్నీలో, అదీ రెండు వారాల వ్యవధిలో ఏకంగా రెండు ట్రిపుల్ సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు నెల్లూరుకు చెందిన కల్లూరి రేవంత్‌రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నిర్వహిస్తున్న అండర్ -14 రెండు రోజుల టోర్నమెంట్‌లో రేవంత్ ఈ ఘనత సాధించాడు.

గత నెల 23న విజయనగరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రేవంత్ రెడ్డి చెలరేగి ఆడి ట్రిపుల్ సెంచరీ (304 నాటౌట్) నమోదు చేశాడు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రేవంత్ మరోమారు రెచ్చిపోయాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన రేవంత్ 289 బంతులు ఎదుర్కొని 53 ఫోర్లతో 301 పరుగులు చేసి రెండో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఏసీఏ చరిత్రలోనే ఇది రికార్డు. ఒకే టోర్నీలో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేయడం ఏ వయో విభాగంలోనైనా ఇదే తొలిసారి. రేవంత్ ఆటకు అందరూ ఫిదా అయిపోయారు. అతడు షాట్లు కొట్టే తీరుకు ముగ్ధులయ్యారు. భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌గా అప్పుడే ఆకాశానికెత్తేస్తున్నారు.

More Telugu News