దుర్గమ్మ: దుర్గమ్మ చలువ వల్లే ఈ స్థాయికి వచ్చాం.. పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించిన సీఎం
- భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం
- అమరావతి దేశానికే తలమానికం కానుందన్న బాబు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కనకదుర్గమ్మ వారికి సీఎం చంద్రబాబునాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు చంద్రబాబు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ తో పాటు ఫొటోలు కూడా జతపరిచారు.
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు జరపడం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి దేవి అమ్మవారికి పూజలు చేసి భవిష్యత్తులో స్మార్ట్ వాటర్ గ్రిడ్ రావాలని, పోలవరం పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానం జరగాలని, రాష్ట్రం స్వచ్ఛాంధ్రాగా మారాలని, రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి కావాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.
రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగినప్పటికీ ఈ స్థాయికి వచ్చామంటే అది దుర్గమ్మ చలువేనని, ఏపీలో విజయవాడ, శ్రీశైలం శక్తిపీఠాలు ఉండటం మన అదృష్టమని అన్నారు. కొత్త సాంకేతికతతో భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు తగ్గే అవకాశం ఉందని, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి దేశానికే తలమానికంగా మారబోతుందని అన్నారు.