మహేశ్ బాబు: రివ్యూలపై ఇన్ని వివాదాలు ఎందుకో తెలియడం లేదు!: హీరో మహేశ్ బాబు
- రివ్యూలపై స్పందించిన మహేశ్ బాబు
- సినిమా బాగుంటే బాగుందని, లేకపోతే లేదని రాస్తున్నారు
- ‘స్పైడర్’ బాగుంటుంది.. మంచి రివ్యూస్ వస్తాయి
సినిమా రివ్యూలపై ఈ మధ్య చాలా వివాదాలు జరుగుతున్నాయని, అలా ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదని హీరో మహేశ్ బాబు అన్నాడు. పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, ‘ఈ విషయమై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. నిజం చెప్పాలంటే.. నేను కూడా రివ్యూస్ చదువుతున్నాను. సినిమా బాగుంటే బాగా రాస్తున్నారు, బాగుండకపోతే బాగా రాయట్లేదు. సింపుల్ సింపుల్ లాజిక్. ఇంతకన్నా వివరించి నేను చెప్పలేను. మా సినిమా ‘స్పైడర్’ బాగుంటుంది.. చాలా మంచి రివ్యూస్ వస్తాయని నేను భావిస్తున్నాను’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు.
కాగా, మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘స్పైడర్’ రేపు విడుదల కానుంది. ఇదిలా ఉండగా, నిన్న ‘జై లవ కుశ’ చిత్రం సక్సెస్ మీట్ లో దారినపోయే దానయ్యలు తమ ఇష్టానుసారం సినిమా గురించి విశ్లేషణలు చేస్తున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో మహేశ్ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.