రాజమౌళి: సీఎంతో రాజమౌళి మళ్లీ భేటీ అవుతారు.. లండన్ పర్యటన ఖరారు కాలేదు: మంత్రి నారాయణ
- సీఎంతో ముగిసిన రాజమౌళి భేటీ
- ఈ రోజు సాయంత్రం మరోసారి సమావేశం
- ఐకానిక్ భవనాలు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన రాజమౌళి
రాజధాని డిజైన్లపై టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళిని లండన్‌కి కూడా తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు ఉదయం ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో పర్యటించిన రాజమౌళి ముఖ్యంగా ఐకానిక్ భవనాలు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారని మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.
అనంతరం తాత్కాలిక సచివాలయం, కృష్ణా నదీపరీవాహక ప్రాంతాన్ని కూడా ఆయన చూశారని తెలిపారు. రాజధాని డిజైన్లపై చంద్రబాబుతో మధ్యాహ్న భేటీ ముగిసిందని, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాజమౌళి మరోసారి సీఎంతో సమావేశం అవుతారని నారాయణ తెలిపారు. రాజమౌళి లండన్ పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.