: ఇప్పటికిప్పుడు అణ్వస్త్ర పరీక్షలను ఆపితే.. ఏం జరుగుతుందో కిమ్ జాంగ్ కు బాగా తెలుసు: రష్యా అధ్యక్షుడు పుతిన్
- కిమ్ జాంగ్ లో అభద్రతా భావం ఉందన్న రష్యా అధ్యక్షుడు
- సద్ధాంలా అయిపోతాననే భయం ఉంది
- కిమ్ జాంగ్ లో భయాన్ని పోగొట్టాల్సింది అమెరికానే
- ఆంక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు
జపాన్ భూభాగం మీదుగా ఉత్తర కొరియా జరిపిన క్షిపణి పరీక్షను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆయన చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు అణ్వస్త్ర పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆపరని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి ఎన్ని కఠిన ఆంక్షలను విధించినా... కిమ్ తన తీరును మార్చుకోరని అభిప్రాయపడ్డారు. చివరకు గడ్డి తినడానికి కూడా ఆయన సిద్ధపడతారే తప్ప... పరీక్షలను ఆపబోరని చెప్పారు.
అణ్వస్త్ర పరీక్షలను ఆపితే ఏం జరుగుతుందో కిమ్ కు తెలుసని అన్నారు. ఈ కారణంగానే అణ్వస్త్ర పరీక్షలకు, క్షిపణి పరీక్షలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా ఆయన వెనుకాడటం లేదని చెప్పారు. తాను కూడా ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ లా అయిపోతానేమోననే భయం కిమ్ లో ఉందని... ఆయనలో ఉన్న ఆ భయాన్ని, అభద్రతా భావాన్ని అమెరికానే తొలగించాలని తెలిపారు. అప్పుడు మాత్రమే అణు పరీక్షలను కిమ్ ఆపేస్తాడని చెప్పారు. ఆంక్షలు విధించడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.