: పట్టుకోల్పోతున్న బిగ్‌బాస్... వీకెండ్స్‌లోనూ తక్కువ రేటింగ్స్!
జూలై 16న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన `బిగ్‌బాస్` కార్యక్రమానికి మొదట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చిన ఎపిసోడ్ ఏకంగా తెలుగు టెలివిజన్ రియాలిటీ షో చరిత్రలోనే అత్యధిక టీఆర్పీలు సాధించిన ఎపిసోడ్‌గా నిలిచింది. సాధారణంగా రియాలిటీ షోలకు ఎపిసోడ్లు పెరుగుతుంటే... రేటింగ్స్ పెరగాలి. కానీ బిగ్‌బాస్ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 24న చివరి ఎపిసోడ్ ప్రారంభం కానున్న బిగ్‌బాస్ కార్యక్రమానికి ప్రస్తుతం చాలా తక్కువ రేటింగ్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. జూ. ఎన్టీఆర్ కనిపించే వారాంత ఎపిసోడ్ల రేటింగ్స్ కూడా పడిపోయినట్లు సమాచారం.
ప్రేక్షకులకు ఇష్టమైన పార్టిసిపెంట్లంతా ఎలిమినేట్ అవడం, టాస్కుల్లో కొత్తదనం లేకపోవడం, పార్టిసిపెంట్లు కూడా అనాసక్తిగా కనిపిస్తుండటం వంటి కారణాల వల్ల రేటింగ్స్ పడిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 1 విజేత బరిలో హరితేజ, నవదీప్, శివబాలాజీలు ఉన్నారు. గెలిచిన వారికి రూ. 50 లక్షలు బహుమతిగా అందించనున్నారు. ఇదిలా ఉండగా మరో నటుడు దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న `నెం. 1 యారి` కార్యక్రమానికి రోజురోజుకీ రేటింగ్స్ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.