: ప్రియుడి ఇంటి ముందు మోడలింగ్ విద్యార్థిని దీప్తి మౌనపోరాటం!
- సోషల్ మీడియా ఖాతాల ద్వారా పరిచయం
- ఏడాది పాటు సాగిన ప్రేమ
- పెళ్లికి ఒప్పుకుని అధిక కట్నం అడిగిన ప్రియుడి తల్లిదండ్రులు
- పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
సోషల్ మీడియా ఖాతాల ద్వారా పరిచయమై, ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడి ఇంటి ముందు మోడలింగ్ విద్యార్థిని అక్షయ దీప్తి మౌనపోరాటానికి దిగిన ఘటన గుంటూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నగర పరిధిలోని శ్రీనగర్ కు చెందిన దీప్తికి ఏడాది నుంచి విజయవాడలో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న పల్యాది చైతన్య అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిచింది. ఇద్దరి వివాహానికి పెద్దలు కూడా అంగీకరించారు.
అయితే, వీరి వివాహం జరగాలంటే తమ బిడ్డకు భారీగా కట్న కానుకలు ముట్టజెప్పాలని చైతన్య తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అంత శక్తి తమకు లేదని చెప్పిన దీప్తి తల్లిదండ్రులు సంబంధాన్ని వద్దనుకున్నారు. ఆపై కూడా వీరిద్దరి మధ్యా చనువు నడిచింది. అయినా పెళ్లికి మార్గం కుదరకపోవడంతో దీప్తి పోలీసులను ఆశ్రయించింది. చైతన్యను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని వైఖరి మారలేదు. అతనే కావాలని భావించిన దీప్తి, ఎస్పీ గ్రీవెన్స్ సెల్ ను కూడా ఆశ్రయించింది. అయినా పరిస్థితి తనకు అనుకూలంగా మారక పోవడంతో గురువారం నుంచి చైతన్య ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఇదిలావుండగా, చైతన్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా, చైతన్య పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. దీప్తిని చేసుకునేందుకు అతను నిరాకరించడంతో కేసు పెట్టి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. చైతన్యకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అరండల్ పేట స్టేషన్ లో చైతన్య తరఫున ఓ పోలీసు అధికారి తనకు బేరం పెట్టాడని దీప్తి ఆరోపించింది.