: ముందు రూ. 10 కోట్లు కట్టండి... తరువాత మాట్లాడదాం!: డెల్లాయిట్ కి తెలుగు రాష్ట్రాల హైకోర్టు సూచన
* అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
* సంస్థ ఆస్తులు, డిపాజిట్ల వివరాలను పరిశీలించే అవకాశం
* విచారణ 22కు వాయిదా
* 32 లక్షల మందికి రూ. 6,880 కోట్లు చెల్లించాల్సిన అగ్రిగోల్డ్
అగ్రిగోల్డ్ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిన ఐటీ దిగ్గజం డెల్లాయిట్ కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక సూచనలు చేసింది. టేకోవర్ ఆలోచన ఉన్నట్లయితే, రూ. 10 కోట్లను వారం రోజుల్లోగా కోర్టు వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆపై షరతులు, విధివిధానాల గురించి వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీకి ఉన్న ఆస్తులు, డిపాజిట్లు తదితరాల వివరాలను పరిశీలించే అవకాశం సంస్థకు ఇవ్వాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఐడీ అధికారులను, అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఆ సంస్థ సేల్ డీడ్లు, ఇతర ముఖ్య లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పరిశీలించే అవకాశం ఇవ్వాలని రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలకు కూడా సూచించింది. సంస్థ ఆస్తుల్లో బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వాటి వివరాలను అందించాలని చెప్పింది. విచారణను 22కు వాయిదా వేస్తున్నామని ఈలోగా డబ్బు కట్టాలని న్యాయమూర్తులు వీ రామసుబ్రమణియన్, ఎస్వీ భట్ లతో కూడిన బెంచ్ వెల్లడించింది. కాగా, దాదాపు 32 లక్షల మంది డిపాజిట్ దారులకు రూ. 6,880 కోట్లకు పైగా అగ్రిగోల్డ్ సంస్థ చెల్లించాల్సి వుందన్న సంగతి తెలిసిందే.