: భారత్-ఆసీస్ తొలి వన్డేకి అప్పుడే పూర్తిగా అమ్ముడుపోయిన టికెట్లు
శ్రీలంక టూర్‌లో సూపర్ సక్సెస్ అయిన టీమిండియా ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచులు ఆడడానికి రెడీ అయింది. క్రికెట్ ఆటపై ఎంతో మక్కువ చూపే భారతీయులు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. తొలి వన్డేకు అప్పుడే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జీఎస్టీ, వినోద పన్నులతో కలిసి మొత్తం ఏడు ధరల్లో టికెట్లను విక్రయించారు.
ఈ స్టేడియం సామర్థ్యం 38వేల సీట్లు. ఈ నెల 17 ఆదివారం కావడంతో సమయాని కంటే ముందుగానే టికెట్లన్నీ అమ్ముడుపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. శ్రీలంకపై గెలిచిన ఊపులో ఉన్న టీమిండియా మరోసారి రాణిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దిగ్గజ జట్ల మధ్య జరగనున్న ఈ వన్డేల్లో పరుగుల వరద ఖాయమని స్టేడియం నిర్వాహకులు అంటున్నారు. వన్డేల్లో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా టీమిండియా కూడా అదే 117 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.