: చిన్న పొరపాటు... పెద్ద నష్టం.. కష్టాల్లో పడిన టెన్నిస్ ఆటగాడి మాజీ ప్రియురాలు!
తన తరఫు లాయర్లు చేసిన చిన్న పొరపాటు వల్ల టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ మాజీ ప్రియురాలు రియా పిళ్లై కష్టాల్లో పడింది. వారి తప్పిదం వల్ల ఆమెకు కోటి రూపాయలకు బదులుగా రూ. పది లక్షలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిపై మళ్లీ ఆమె కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే - 2005లో పేస్, రియాలు సహజీవనం చేశారు. వారికి అయానా అనే కూతురు కూడా ఉంది. అయితే 2014లో గృహ హింస నేరం కింద లియాండర్ మీద రియా కేసు వేసింది. అంతేకాకుండా ఏకమొత్తంలో కోటి రూపాయల పరిహారం కోరింది. ఈ నేపథ్యంలో బాంద్రా కోర్టులో వేసిన మధ్యంతర దరఖాస్తులో ఆమె తరఫు న్యాయవాదులు కోటికి బదులుగా ఒక సున్నా తక్కువ రాయడంతో రూ. పది లక్షలుగా మారింది. ఈ విషయాన్ని గమనించి, వెంటనే రియా మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది.