: విద్యుత్ ఛార్జీలు పెంచడం జరగదు!: ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని, కొనుగోలును క్రమంగా తగ్గించుకుని పునరుత్పాదక విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సూచించారు.
వ్యయం తగ్గించుకోవడం, తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపడంపై దృష్టి సారించాలని, విద్యుత్ శాఖలో సేవలను ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని, డిమాండ్-సప్లయ్ ఆధారంగానే సబ్ స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన జరగాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. అంతేకాకుండా, ఆక్వా రంగం సహా అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగంలో ఆదాకు చర్యలు తీసుకోవాలని, వివిధ వర్గాలుగా వినియోగదారులను విభజించి సేవలు అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.