: డోమినోస్ పిజ్జా సీజనింగ్‌లో పురుగులు... వైరల్ అవుతున్న వీడియో... మీరూ చూడండి!
తాను ఆర్డర్ చేసిన పిజ్జా సీజనింగ్ ప్యాక్‌లో పురుగులు ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి వాటి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పిజ్జా ప్రియులు డోమినోస్ మీద తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన రాహుల్ అరోరా సెప్టెంబర్ 8న పిజ్జా ఆర్డర్ చేశాడు. పిజ్జాతో పాటు వచ్చే చిల్లీ, ఓరెగాన్ సీజనింగ్ ప్యాకెట్లలో కొన్నింటిని తాను ఉపయోగించుకోలేదు. మరుసటి రోజు ఆ ప్యాకెట్లను బ్రెడ్ మీద వేసుకుని తినాలనుకున్నాడు. వాటిని విప్పి చూడగా అందులో పురుగులు ఉండటం గమనించాడు.
డోమినోస్ వారికి ఈ విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో, వీడియో తీసి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. రాత్రి పిజ్జా మీద వేసుకుని తిన్నప్పుడు పురుగులను గమనించకుండా అలాగే తినుంటామని, పిజ్జా ఆర్డర్ చేసిన శాఖ వివరాలను కూడా పోస్ట్ చేశాడు. 2000పైగా షేర్లు వచ్చిన ఈ వీడియోపై డోమినోస్ సంస్థ స్పందించింది. తాము కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెబుతూ, అరోరాను క్షమాపణలు కోరింది. అయితే ఈ విషయంపై రాహుల్ అరోరా వినియోగదారుల చట్టం కింద ఫిర్యాదు చేసినట్లు సమాచారం.