: ఇటువంటి పుస్తకాలు రాయడం వెనుక కంచ ఐలయ్య ఉద్దేశం అదే!: మహేశ్ కత్తి
ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాస్తోన్న పుస్తకాలు ఎన్నో వివాదాలు సృష్టిస్తున్నాయంటూ వస్తోన్న విమర్శలపై సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి స్పందించాడు. ‘అధికార కులాలు శ్రామిక కులాల్ని దోచుకుతిని, వాళ్ల జ్ఞానాన్ని అణగదొక్కారనేది కంచ ఐలయ్య గారి సిద్ధాంతం.. దానికి బలాన్ని చేకూర్చేవే ఈ పుస్తకాలు. వీటితో విభేదించే వారు కొంచెం చరిత్రను తెలుసుకుంటే మంచిది. నరుకుతా.. చంపుతా.. అనేవారు కాస్త రాజ్యాంగాన్ని, చట్టాన్ని తెలుసుకుంటే ఇంకా మంచిది’ అని మహేశ్ కత్తి తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా కంచ ఐలయ్య గతంలో రాసిన పుస్తకాల పేర్లను మహేశ్ కత్తి పోస్ట్ చేశాడు.
మహేశ్ కత్తి వాదనకు తన ఫాలోవర్లు మద్దతు తెలుపుతున్నారు. అప్పట్లో అగ్రకులాల వారు కింది కులాల వారిని తిడుతూ, తామే గొప్పవారమంటూ తమకు అనుకూలంగా రాసుకునేవారని, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందని కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలా రాస్తారేమో అన్న భయంతోనే కొన్ని శతాబ్దాలు వారికి జ్ఞానం, చదువు అనేవి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ వైపు వెర్షన్ వినాలంటే బాధ. అప్పటి కులాల వివక్షలు ఇప్పుడు లేకుంటే ఇలాంటి పుస్తకాలు మాత్రం ఎందుకు వస్తాయి?’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.