: డిస్కో శాంతి, లలిత కుమారిల మేనకోడలు అదృశ్యం... వారం రోజులైనా లభ్యం కాని ఆచూకీ!

సినీ నటులు డిస్కో శాంతి, లలిత కుమారిల మేనకోడలు అపర్ణ (17) అదృశ్యం కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం అపర్ణ అదృశ్యం కాగా, ఇంకా ఆమె ఆచూకీ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అపర్ణ తల్లి సెరిల్, మేనత్త లలిత కుమారి (ప్రకాశ్ రాజ్ మొదటి భార్య) మీడియా ముందుకు వచ్చారు. చైన్నైలోని టీనగర్ లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్‌ మొళివర్మన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. అపర్ణ ప్లస్ టూ చదువుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు.

దీంతో బంధువులు, స్నేహితులు, చైన్నైలోని వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు పాండీ బజార్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఐతే వారం రోజులైనా తమ బిడ్డ ఆచూకీ లభించడం లేదని వారు వాపోయారు. ఇప్పటికే అపర్ణ చదువుతున్న చర్చ్‌ పార్క్ స్కూల్ లో విచారించామని చెప్పారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్ ను పరిశీలించామని చెప్పారు. అయితే తమకు అవసరమైన చోట సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో అపర్ణ అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు. అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత మీడియాను ఆశ్రయించామని, తమ అపర్ణ గురించి ఎవరికి తెలిసినా లేదా ఆమె కనిపించినా సమాచారం అందించాలని వారు కోరారు. 

More Telugu News