: టీడీపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు.. నారా లోకేష్ తో చర్చలు కూడా పూర్తయ్యాయ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసింది. అయితే, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్... 'జై సమైక్యాంధ్ర' పార్టీని పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతంర కిరణ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన బీజేపీలో చేరుతారని కొన్నిసార్లు, వైసీపీలో చేరుతారని మరి కొన్నిసార్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజాగా ఓ వార్త వెలుగు చూసింది. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరుతున్నారనేదే ఆ వార్త. ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతల ద్వారా నారా లోకేష్ తో కిషోర్ సంప్రదింపులు జరిపారట. చిత్తూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిషోర్ టీడీపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని లోకేష్ కూడా భావిస్తున్నారట.
కిషోర్ ను పార్టీలోకి తీసుకురావడానకి జిల్లాకు చెందిన మంత్రి అమరనాథ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా రామచంద్రారెడ్డి తదితరులు ఈ విషయమై కిషోర్ తో పలుమార్లు చర్చలు జరిపారట. ఈ నేపథ్యంలో, తన ముఖ్య అనుచరులతో మంతనాలు సాగించిన కిషోర్... చివరకు టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఆయన పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు.