: పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ కి నేతృత్వం వహించిన మేజర్ అనుభవం ఇది!
పీవోకేలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ఏడాది పూర్తికానుంది. దీనిని పురస్కరించుకుని ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్– ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ హీరోస్’ పేరిట పుస్తకం వెలువడనుంది. ఈ పుస్తకంలో 14 వాస్తవ ఘటనలను పొందుపరిచారు. అందులో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎదుర్కొన్న పరిస్థితులను, తన అనుభవాన్ని ఆ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన మేజర్ పొందుపరిచారు. వాటి వివరాల్లోకి వెళ్తే... యూరీ సెక్టార్ లో జరిపిన ఉగ్రదాడిలో సహచరుల్ని కోల్పోయిన రెండు యూనిట్లకు సంబంధించిన మెరికల్లాంటి 19 మంది కమాండోలను సర్జికల్ స్ట్రైక్స్ కోసం ఎంచుకున్నామని మేజర్ తెలిపారు.
ఘాతక్ ప్లటూన్ గా పిలిచే వీరిని పీవోకేలోని భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు సరిహద్దుకు తరలించినట్టు తెలిపారు. దాడి లక్ష్యాన్ని అతి కొద్దిమంది అధికారులకు మాత్రమే తెలిపినట్టు ఆయన వెల్లడించారు. 'ఐబీ', 'రా' ఉన్నతాధికారులతో దాడికి ప్రణాళిక రచించినట్టు తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ చేయడం చాలా సులభంగా జరిగిపోయిందని, అయితే దాడి తరువాత సురక్షితంగా సరిహద్దు చేరడమే కష్టంగా మారిందని తెలిపారు. పీవోకే లోని ఇద్దరు పౌరులతో పాటు, జైషే మొహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల సమాచారంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాక్ సైన్యం, ఐఎస్‌ఐ రక్షణ కల్పిస్తున్న నాలుగు ఉగ్ర స్థావరాలను ఎంచుకున్నామని తెలిపారు.
ఉగ్రశిబిరాల్లో దొరికినవారిని దొరికినట్టు చంపేయాలన్న స్పష్టమైన ఆదేశాలతో రంగంలోకి దిగడంతో ఎదురువచ్చిన వారిని మట్టుబెట్టామని వారు తెలిపారు. ఈ దాడిలో తమ కమాండోలు ఎం4ఏ1, ఇజ్రాయెల్ తయారీ తవోర్ టీఏఆర్–21, ఇన్ స్టలజా సీ–90 ఆయుధాలను వాడామని, తాను ఎం4ఏ1 కార్బైన్ తుపాకీని వాడానని, కేవలం గంటల్లోనే దాడిని ముగించామని తెలిపారు. అయితే ఈ ఉగ్రస్థావరాలు పాక్ ఆర్మీకి చెందిన స్థావరాలకు దగ్గరగా ఉండడంతో వారు వేగంగా స్పందించారని తెలిపారు. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా ఉగ్రస్థావరాలపై దాడి అనంతరం తామంతా కలుసుకున్నామని అన్నారు. ఇంతలో ఉగ్రస్థావరాలకు మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు.
దీంతో భారత సైన్యం దాడి చేసిందని నిర్ధారించుకున్న పాక్ సైన్యం అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఆయన చెప్పారు. తమ చెవుల పక్కనుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని ఆయన చెప్పారు. దీంతో దాడి అనంతరం భారత్ చేరేందుకు వెళ్లిన దారి కాకుండా కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నామని వారు తెలిపారు. కొండలపై పాకుతూ చాలా దూరం వెళ్లాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎట్టకేలకు ఉదయం 4.10 నిమిషాలకు భారత్ కు సురక్షితంగా చేరామని ఆయన తెలిపారు. ఈ దాడిలో 38–40 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాక్ ఆర్మీ అధికారులను హతమార్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ పుస్తకాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాయగా... పెంగ్విన్ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది.