: జీ గ్రూప్ చేతికి అగ్రిగోల్డ్: స్వయంగా వెల్లడించిన చంద్రబాబు, బాధితుల్లో ఆశలు!
ప్రజల నుంచి వందల కోట్ల విలువైన డిపాజిట్లు కట్టించుకుని ప్లేట్ తిరగేసిన అగ్రిగోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీ గ్రూప్ ఆసక్తిగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అగ్రీగోల్డ్ అధీనంలో ఉన్న భూములను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర ఆసక్తిని చూపుతున్నారని చంద్రబాబు తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. క్యాబినెట్ సమావేశంలో అగ్రీగోల్డ్ ఆస్తులను జీ గ్రూప్ కొనుగోలు చేయనుందని ఆయన తెలిపారు. దీన్ని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇటీవల తనను కలిసిన సుభాష్ చంద్ర, ఈ ప్రతిపాదన తీసుకువచ్చారని, బాధితులకు న్యాయం జరుగుతుందంటే, తనకు అభ్యంతరం లేదని చెప్పానని ఆయన అన్నారు.
వేలం ప్రక్రియ నత్త నడకన సాగుతోందని, దీంతో బాధితుల్లో ప్రభుత్వంపై నమ్మకం సడలుతోందని ఓ మంత్రి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించిన వేళ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితులకు న్యాయం జరుగుతుందన్న పక్షంలో కోర్టుల నుంచి సైతం పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, డిపాజిట్ దారులకు ప్రస్తుతం అగ్రీగోల్డ్ రూ. 6 వేల కోట్ల వరకూ చెల్లించాల్సివుంది. సంస్థ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 3 వేల కోట్లు కాగా, మార్కెట్ లెక్కల్లో అది రూ. 10 వేల కోట్ల వరకూ ఉంటుందన్నది అధికారుల అంచనా. దీంతో అగ్రీగోల్డ్ బాధితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి తమకు న్యాయం కోసం నిరసనలు తెలుపుతున్న వారు, ఇప్పుడైనా తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయని ఎదురుచూస్తున్నారు.