: అమర సైనికుల భార్యలకు కొత్త జీవితం.. ఆర్మీ అధికారులుగా ప్రస్థానం ప్రారంభం!


దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల భార్యలు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆర్మీ అధికారులుగా సరికొత్త జీవితంవైపు అడుగులు వేస్తున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ‘ఆల్డ్ లంగ్ సైన్’లో శిక్షణ పూర్తిచేసుకున్న 332 మంది అమరుల భార్యలకు అధికారులు ర్యాంకులు ప్రదానం చేశారు. వీరంతా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో వివిధ ర్యాంకుల్లో విధులు నిర్వర్తించనున్నారు.

నవంబరు 2015లో జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదులతో పోరాడుతూ మృతి చెందిన కల్నల్ సంతోష్ మహాదిక్ భార్య స్వాతి మహాదిక్, 2009లో అమరుడైన నాయక్ భార్య నిధి మిశ్రాలు ఆర్డినెన్స్ వింగ్‌లో లెఫ్టినెంట్ పోస్టుల్లో నియమితులయ్యారు. భర్త మరణానంతరం తమ బీరువాలో ఉన్న ఆర్మీ యూనిఫాం తనకు స్ఫూర్తినిచ్చిందని స్వాతి తెలిపారు. ఇప్పుడు తమను యుద్ధం రంగంలోకి ఎప్పుడు దింపుతారా? అని ఎదురుచూస్తున్నట్టు ఆమె తెలిపారు. 2016లో ఎస్ఎస్‌బీ ఎగ్జామ్‌తోపాటు అదే సమయంలో గెరిల్లా యుద్ధ విద్యలు నేర్చుకున్న స్వాతి వయసు 38 ఏళ్లు అయినా అమరుడి భార్య కావడంతో సడలింపు ఇచ్చారు. నిజానికి ఈ ఎగ్జామ్‌కు 27 ఏళ్లకు మించరాదు. ఆమెకు కార్తీకీ (12), స్వారాజ్ (6) అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

నాయక్ భార్య నిధి మిశ్రా ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తి చేశారు. ఆర్మీ స్కూల్‌లో చేరడానికి ముందు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. 2014లో ఆర్మీలో చేరిన ఓ అమరుడి భార్య ప్రియ సెమ్వాల్ గురించి చదివిన తర్వాత నిధి కూడా ఆర్మీలో చేరాలనుకుని నిర్ణయించుకున్నారు. ఐదు ప్రయత్నాల తర్వాత ఎంట్రన్స్  పాస్ అయినట్టు ఆమె తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయం వెనక తన ఎనిమిదేళ్ల కుమారుడు, కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని ఆమె వివరించారు. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న నిధి ఆర్డినెన్స్ వింగ్‌లోని ఆర్మ్‌డ్ డివిజన్‌లో చేరనున్నారు.

తాను ఏదో ఒకరోజు తన భర్తలా కల్నల్‌ను అయితే ఈ జీవితంలో అంతకంటే గొప్ప విషయం మరోటి ఉండదని స్వాతి ఆనందంగా చెప్పారు. అయితే ప్రస్తుతం తన పై అధికారుల మార్గదర్శనంలో కొత్త విషయాలు నేర్చుకునే పనిలో ఉన్నానని స్వాతి వివరించారు.

  • Loading...

More Telugu News