: కర్ణాటకలో తెలుగు విద్యార్థులపై దాడిని ఖండించిన ఏపీసీసీ.. ఆ రాష్ట్ర హోం మంత్రితో మాట్లాడిన రఘువీరారెడ్డి
కర్ణాటకలో తెలుగు విద్యార్థులపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకుని, దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగారెడ్డిని రఘువీరారెడ్డి కోరారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థులకు రేపు, ఎల్లుండి జరిగే పరీక్షలకు భద్రత కల్పించాలని కూడా తాను కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. తెలుగు విద్యార్థులపై దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకుని, ఇటువంటి చర్యలు మళ్లీ జరగకుండా చర్యలు చేపడతామని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి తమకు హామీ ఇచ్చినట్లు రఘువీరారెడ్డి తెలిపారు.