: మొన్న ఆసుస్.. ఇవాళ ఇంటెక్స్... మొబైల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న జియో
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రిలయన్స్ జియో ఇప్పుడు మొబైల్ కంపెనీలను సైతం ఆఫర్ల వర్షంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మొన్నటికి మొన్న జియో వాడుతున్న ఆసుస్ మొబైల్ వినియోగదారులకు రూ. 309 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే 100జీబీ 4జీ డేటాను ఉచితంగా అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఇంటెక్స్ మొబైల్ కంపెనీతో కూడా జియో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా జియో నెట్‌వర్క్ వాడుతున్న ఇంటెక్స్ మొబైల్‌ఫోన్ వినియోగదారులకు 25జీబీ వరకు 4జీ డేటాను ఉచితంగా అందించనుంది. అలాగే రూ.309 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌పై 5జీబీ 4జీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, అయితే ఈ ఆఫర్ గరిష్టంగా 5 రీఛార్జీలకు మాత్రమే వర్తించనున్నట్లు ఇంటెక్స్ ప్రకటించింది. వీటితోపాటు త్వరలో మరికొన్ని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఇంటెక్స్ సంస్థ డైరెక్టర్ నిధి మార్కండేయ తెలిపారు. జియో అందించే ఆఫర్లు ఆకర్షించేలా ఉండటంతో మొబైల్ కంపెనీలు కూడా జియోతో ఒప్పందానికి మొగ్గు చూపుతున్నాయి.